మహాశివుడు ఒంటిపై ఎప్పుడూ బూడిద లేదా చితాభస్మం ఉంటుంది. శివ అంటే శుభం, మంగళకరం, కళ్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థం. అలాంటి శుభకరుడైన శివుడు…అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటి వాటితో ఉంటాడు. వాటినే ధరిస్తాడు..ప్రీతిపాత్రంగా భావిస్తాడు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి
ఈ విషయాలను మనం శివ పురాణం నుంచి సమాధానం పొందవచ్చు.ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం అంటారు. అలాగే శివుడి నుదుటిపై, ఒంటిపై ఉండే చితాభస్మానికి సంబంధించి శివ పురాణంలో ఆసక్తికర కథనం ఒకటి ఉంది.
శివ పురాణం ప్రకారం.. ఓ రుషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ రుషి కేవలం ఆకులు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ రుషి పేరు ప్రణాద్. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమత్తుల కోసమని దుంగలను కోస్తున్నప్పుడు.. అనుకోకుండా తన చేతి వేలికి గాయమవుతుంది.
గాయమైన ఆ చేతి వేలి నుంచి రక్తానికి బదులు.. ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంటుంది. దీంతో తన శరీరమంతా రక్తానికి బదులు, చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడుతాడు. ఆ రుషిని గమనించిన శివుడు అతని వద్దకు మారు వేషంలో వెళ్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక.. మొక్కలు, చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని అతనితో అంటాడు.
ఆ వెంటనే తన చేతి వేలిని కోసుకుని చూపిస్తాడు. అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది. అప్పుడు ఆ రుషికి అర్థమవుతుంది. తన ఎదుట ఉన్నది భగవంతుడు అని. అంతే.. శివుడిని ఆ రుషి క్షమాపణ కోరుతాడు. ఇక అప్పటినుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే కనిపిస్తాడు. ఎవరైనా బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసి అహంకారం ప్రదర్శించవద్దు. అంతిమ నిజమేమిటన్నది ప్రతీ ఒక్కరూ గ్రహించాలనేదే దీని సారాంశం. మహా శివరాత్రి పూట శివ పురాణాన్ని వినడం ద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని చెబుతారు.