రంగురంగు పూల బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి. చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయికే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తోందంటే తెలంగాణ పల్లెలో పండగ వాతావరణం కనిపిస్తుంది.  ఎంగిలిపూలతో మొదలై… సద్దులతో ముగుస్తుంటాయి బతుకమ్మ వేడుకలు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ అత్యంత ప్రత్యేకమైనది. ఆ రోజు పెద్దగా బతుకమ్మలు పేర్చడమే కాకుండా ప్రత్యేకమైన పిండి వంటకాలు, తీపి సద్దులు చేసి బతుకమ్మ సంబరాల్లో ఒకరికొకరు పంచుకొనేది. అయితే ఈ సారి ఎంగిలి బతుకమ్మకు రెండు ముగింపులు వస్తున్నాయి.

బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంటుంది. ఎంగిల పూలతో సంబురం మొదలైంది. మహిళలు తీరొక్క పూలతో వీధివీధిన బతుకమ్మను కొలుస్తున్నారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. వాస్తవానికి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది మాత్రం కాస్త గందరగోళం నెలకొంది.

తెలంగాణ రాష్ట్రమంతటా ఈసారి బుధ, గురు వారాల్లో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో బుధవారం.. మరికొన్ని ప్రాంతాల్లో గురువారం చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో… స్థానిక సంప్రదాయం ప్రకారం అదే పద్ధతిని జనం ఫాలో అవుతున్నారు. ఐతే… వేములవాడ, కొండపాక సహా.. పలు ప్రాంతాల్లో బతుకమ్మను 7 రోజులు, 11, 13 రోజులు ఆడే సంప్రదాయం కూడా ఉంది. అయితే… ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఏటా 9రోజులకే బతుకమ్మ వేడుకలను ముగిస్తారు.

సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ ఇళ్లు, వాకిళ్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. గునుగు, తంగేడు, చామంతి, బంతి, మందార, కనకాంబరం,  గులాబీ, పట్టుకుచ్చుల పువ్వులు సేకరిస్తారు. గుత్తులు కట్టి బతుకమ్మ పేరుస్తారు. దారంతో కట్టిన గునుగు పూల గుత్తులను రంగుల్లో అద్ది బతుకమ్మకు అందాలు అద్దుతారు. గుమ్మడి పువ్వు లేదా పసుపుతో గౌరమ్మను పెట్టి మంగళహారతులు, అగరుబత్తులు వెలిగించి కొలుస్తారు. సాయంకాలం బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడి.. పోయిరావమ్మా బతుకమ్మ అంటూ సాగనంపుతారు.