ఖండాంతర ఖ్యాతి పొందిన సమ్మక్క, సారలమ్మల మహాజాతర ఈ రోజే మొదలవుతోంది. ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం జాతర ప్రారంభమై శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపధ్యంలో తరతరాలుగా వస్తున్న ఆచారం మేరకు…సమ్మక్క భర్త పగిడిద్దరాజు సోమవారం పెండ్లి కొడుకుగా ముస్తాబై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ నుంచి మేడారం బయిలుదేరాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు మంగళవారం చేరుకున్నాడు. అక్కడ పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు జరిగాయి. తళపతి బుచ్చిరాములు ఇంటి నుంచి పానుపు(పసుపు, కుంకుమ)ను డోలు వాయిద్యాల నడుమ గుడికి చేర్చి రహస్య పూజలు చేసారు.
తర్వాత పగిడిద్దరాజును పెండ్లి కొడుకుగా పడిగె ఆకారంలో వెదురు కర్రకు అలంకరించారు. తర్వాత శివసత్తుల పూనకాలతో దేవుని గుట్ట మీదుగా కాలి నడకన మేడారం బయలెల్లుతారు. పూనుగొండ్ల నుంచి కర్లపల్లి మీదుగా పస్రా దగ్గర్లోని లక్ష్మీపురంలో పెనుక వంశస్తుల ఇంటిలో బస చేసి బుధవారం సాయంత్రం వరకు మేడారం చేరుకుంటారు.అక్కడికి పగిడిద్దరాజు చేరుకున్నాక సమ్మక్క పూజారులు ఎదుర్కోళ్ళు నిర్వహించి గద్దెపైకి చేర్చడంతో మహా జాతర ప్రారంభమవుతుంది. తర్వాత కొండాయి నుంచి గోవిందా రాజులు, కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తారు.
మరో ప్రక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డలోని పగిడిద్దరాజు గుడిలో సోమవారం అరెం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి కాలినడకన మేడారం బయలుదేరారు. వీరు మంగళవారం ములుగు జిల్లా లక్ష్మీపురం, అక్కడినుంచి పూనుగొండ్ల చేరుకున్నారు. పెనక వంశీయులతో కలిసి ఈ రోజు( బుధవారం) రాత్రికి మేడారం చేరుకుంటారు. జాతర ముగిశాక అరెం వంశీయులు పగిడిద్దరాజును గుండాలకు తీసుకువచ్చి గర్భగుడిలో ఉంచుతారు. మేడారం జాతర ముగిసిన16 రోజుల తర్వాత వేపలగడ్డంలో జాతర చేస్తారు.