శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట ఇప్పుడు కొత్త శోభను సంతరించుకున్న సంగతి తెలసిందే. వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది.

 సరికొత్త హంగులతో అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. ఈ నేపధ్యంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. అయితే తాజాగా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నేటి నుంచి ఆలయ వేళలు పూజా కైంకర్యాల సమయాలను మార్పు చేసినట్టు దేవస్థాన ఈవో గీతా రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

స్వామి సన్నిధిలో మొక్కు, శాశ్విత ఆర్జిత సేవా కైంకర్యాల్లో పాల్గొనే భక్తులకు స్వామివారి మహా ప్రసాదాలను కొండ పైన దేవస్థాన ప్రసాదాల విక్రయశాల్లో ప్రత్యేక కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులకు స్వామివారి ప్రసాదంగా లడ్డూ, పుళిహోర, వడ ప్రసాదాలను అందించనున్నారు.

Image Courtesy : Wikipedia

మార్పు చేసిన పూజాకైంకర్యాలు, భక్తుల దర్శన వేళల వివరాలు:

సర్వదర్శన వేళలు: ఉదయం 6 నుంచి 7.30 వరకు, తిరిగి 10 నుంచి 11.45 వరకు, మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు, రాత్రి 8.15 నుంచి 9 వరకు

బ్రేక్‌ దర్శనాలు: స్వామివారిని బ్రేక్ దర్శనంలో దర్శించుకునే భక్తులు ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సమయం

విశేష పూజలు: తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం (ఆరగింపు). మధ్యాహ్నం 3 – 4 గంటల మధ్య ఆలయం మూసివేత.

తిరువారాధన: రాత్రి 7 నుంచి 7.45 వరకు

సహస్రనామార్చన: రాత్రి 7.45 నుంచి 8.15 వరకు, అమ్మ వారికి కుంకుమార్చన.

రాత్రి నివేదన: రాత్రి 9 నుంచి 9.30 వరకు రాత్రి నివేదన చేయనున్నారు

ద్వార బంధనం: 9.30–9.45 శయనోత్సవం

ఆండాళ్‌ అమ్మవారి సేవ: ప్రధానాలయంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు.