‘ధర్మాన్ని ఆచరించాలి. దైవాన్ని ఆశ్రయించాలి’ ఈ రెండింటి వల్ల ఎటువంటి కష్టాలనైనా అధిగమించవచ్చు.ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని అనుసరించడమేనని, మన వేద విజ్ఞాన విలువలను పరిరక్షించుకుని భావితరాలకు అందివ్వాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఎప్పుడూ చెప్తూంటారు. అంతర్జాలం వేదికగా షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తూంటారు.అనేక అంశాలపై సమకాలీన పరిస్థితులకు ఉపయోగపడే విధంగా చక్కటి సమయోచితమైన ఉదాహరణలతో షణ్ముక శర్మ ప్రవచిస్తూంటారు. ఈ క్రమంలో ఆయన శ్రీరాముడు గురించి ఎంత అద్బుతంగా చెప్పారో ఓ సారి మననం చేసుకుందాం.
‘రామః కమలపత్రాక్షః సర్వ సత్వ మనోహరః!
రూపదాక్షిణ్య సంపన్నః, ప్రసూతే జనకాత్మజే
రాముడు సర్వజీవులకు మనోహరమైనవాడు. ఏ జీవుడైనా రామతత్త్వం పట్ల ఆకర్షించబడవలసిందే. ప్రతిజీవునిలో ఆత్మతత్త్వంగా ఉన్నది రాముడే. ప్రతివారికి ఆత్మ అంటే మహాప్రీతి. ప్రతివారికి తనంటే తనకు చాలా ఇష్టం.

ఆ తాను అనబడే ఆత్మతత్త్వమే రాముడు.
అందుకే అందరికీ రాముడు అంటే అంత ఇష్టం. ప్రతీవారి హృదయంలో ఉన్న ఆత్మయే రాముడు కనుక సర్వజీవులకు మనోహరుడు. అందుకు పుంసాం మోహన రూపాయ – పుంసాం అంటే సర్వ జీవులకు మోహనమైన రూపమైనవాడు. పురుషుడు అనే మాటకు మగవాడు అని అర్థం తీయడం తప్పు.మానవుడు అనే మాటకు పర్యాయపదం పురుషుడు.ఇది సర్వజీవులకు వర్తిస్తుంది.
పురే శయనం కరోతి ఇతి పురుషః – శరీరం అనే పురంలో ఉన్నవారు పురుషులు. రాముడు సర్వసత్త్వమనోహరుడు. విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు వెళ్ళి, తిరిగి వస్తూ ఉంటే ఆయనను విడిచి పెట్టలేక సిద్ధాశ్రమ అరణ్యాలలో ఉన్న పశుపక్షాదులు రాముని వదలలేక ఆయన వెంట బయలుదేరాయి. అప్పుడు వాటికి రాముడు నచ్చజెప్పి అక్కడే ఉండమన్నాడు. వాటికి రాముని కథ తెలుసా! మహిమ తెలుసా! అంటే వాటి హృదయంలో ఆత్మ కూడా రాముడే అని తెలుసు. అలా సర్వజనాకర్షకమైన ఆత్మతత్త్వం, ఆనంద స్వరూపుడు రామచంద్రమూర్తి.
ఇలా పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు …శ్రీరాముడు తత్వాన్ని చెప్తారు.