భద్రాచలంలో   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు  రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. 11న శ్రీరామచంద్ర పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తారు. ఇక్కడ భద్రాద్రిలో ఈ స్దాయిలో కల్యాణం జరగటానికి కారణమైన ఇతిహాసం తెలుసుకుందాం. త్రేత, ద్వాపర, కలి యుగాలతో ముడిపడిన  ఇతిహాసం ఉంది భద్రాద్రికి.

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది.

వనవాసంలో సీతారాములు ఇక్కడి పర్ణశాల సమీపంలో కొంతకాలం ఉన్నారు. అప్పుడు- ఓ శిలమీద సేదతీరగా అది పట్టుపరుపుల్ని మరిపించిందట. అప్పుడు  రామచంద్రుడు మనస్సు ఆనందంతో నిండిపోయి…‘ద్వాపర యుగంలో నీవు మేరుపర్వతరాజు కుమారుడవై జన్మిస్తావు. కలియుగంలో భద్రుడనే పేరుతో నన్ను శిరస్సున ధరిస్తావు’ అని వరమిచ్చారు.

అలా మేనకకీ మేరుపర్వతరాజుకీ పుట్టిన భద్రుడికి నారదమహర్షి రామమంత్రాన్ని ఉపదేశించగా ఆయన కోసమై ఘోరతపస్సు చేశాడట. అప్పుడు  శ్రీమన్నారాయణుడు శంఖుచక్ర ధనుర్భాణాలతో చతుర్భుజ రాముడిగా అవతరించాడు. వామాంకాన(ఎడమ తొడపై) సీతతో వామ పార్శ్వాన (ఎడమ పక్కన) లక్ష్మణుడితోసహా పద్మాసనుడై భద్రుడి మీద వెలిశాడట. అందుకే భద్రాద్రిలో వైకుంఠరాముడిగా నాలుగుచేతులతో దర్శనమిస్తాడు.

కలియుగంలో ఈ కొండ సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రామభక్తురాలైన పోకల దమ్మక్కకి కలలో కనిపించి తాను భద్రగిరిపై ఉన్నాననీ మిగిలిన భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమనీ ఈ క్రతువులో ఆమెకు మరో భక్తుడు సాయపడతాడనీ చెప్పాడట. ఆ మర్నాడే గ్రామీణులతో కలిసి కొండమీదకి వెళ్లిన దమ్మక్క, పుట్టలో ఉన్న స్వామిని తీసి అక్కడే పందిరి నిర్మించింది. నాటి నుంచీ ఆయనని భక్తితో సేవిస్తూ స్వామికి తాటిపండ్లు నైవేద్యంగా సమర్పించేదట. ఏటా సీతారాములకల్యాణం కూడా నిర్వహించేదట.

ఆ సమయంలోనే పాల్వంచ తాలూకాకి తహసీల్దారుగా ఉన్న గోపన్న భద్రకొండమీద రాముడు కొలువయ్యాడని తెలుసుకుని, ఆయనకో ఆలయం లేకపోవడం చూసి బాధపడి పన్నుగా వసూలు చేసిన డబ్బుతో గుడి కట్టించాడు. అది తానీషాకి ఆగ్రహం కలిగించి గోపన్నని ఖైదు చేయడం, చెరసాలలో తన దుస్థితిని మొరపెట్టుకుంటూ కీర్తనలు ఆలపించడం, చివరకు రామలక్ష్మణులే స్వయంగా తానీషాకి కలలో కనిపించి బాకీ చెల్లించడంతో ఆయన విడుదల కావడం అనేది చారిత్రక కథనం.