శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అశేషమైన భక్తుల జయజయధ్వానాల నడుమ భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ఈ ఏడాది  జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడిదాకా వెళ్లలేని కొందరి భక్తులు కోసం భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ, తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది.

తమ యాప్‌ ద్వారా తలంబ్రాలు బుక్‌ చేసుకోవచ్చని దేవాదాయశాఖ వెల్లడించింది. ఒక కుటుంబానికి రెండు ప్యాకెట్ల చొప్పున బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో ప్యాకెట్‌ ధరను రూ. 80గా నిర్ణయించినట్లు దేవాదాయశాఖ అధికారులు వివరించారు.   ఆన్‌లైన్‌లో తలంబ్రాల కోసం బుక్‌ చేసుకున్నవారికి మూడు రోజుల్లోగా ఇంటికి పంపిస్తామన్నారు.

 భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్‌ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది.

బుక్‌ చేసుకున్నవారు రూ.80 చెల్లించా లి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉం టుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్‌ చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్‌ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు.