శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|
వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరు శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మొదలైన పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక! అంటూ స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపుతాము. ఎంతో ప్రభావవంతమైన , భక్తులకు ఎంతో ప్రాముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ సుప్రభాత సేవ ని ఎవరు రాసారు… ఆ విషయాలు చూద్దాం.

కలియుగంలో వేంకటేశ్వరుడి అవతారంలో భక్తులను కటాక్షిస్తున్న ఆ స్వామి స్తోత్రప్రియుడు. ఆయన్ను ఎన్నిరకాలుగా సేవిస్తే అంత ఆనందపడతారు. అందుకే అన్నమయ్య మొదలుకొని నేటివరకూ ఎవరికీ లేనన్ని స్తోత్రాలు, పాటలు వేంకటేశ్వరస్వామిమీద రచించారు. అలాగే అప్పట్లో శ్రీవారి ఆచార్యపురుషుల్లో ఒకరైన ప్రతివాద భయంకర అణ్ణన్ ఆచార్యులు, ఆయన గురువు అయిన మణవాళ మహాముని ఆజ్ఞాపన మేరకు సుప్రభాతాన్ని రచించారు. సుప్రభాతంలో 11 శ్లోకాలున్న వేంకటేశ్వర స్తోత్రం మొత్తం భగవంతుడిని కీర్తించడానికి రాసినవి.
కౌశల్యా సుప్రజారామా అనే శ్లోకం రామాయణంలోనిది కాగా..9, 13 శ్లోకాలు మార్కండేయ పురాణంలోనివి. మార్కండేయ మహర్షి ఈ పురాణం రాయడం వెనుక కూడా ఓ కథ ఉంది. శ్రీమహావిష్ణువు అవతారమైన వేంకటేశ్వరస్వామికి ఆయన పరమభక్తుడు. ఆయన భూలోకంమీదున్న వేంకటాచలంలో యాత్ర చేయాలనుకున్న సమయంలో గరుత్మంతుడిని సంప్రదిస్తారట. ఆ సమయంలో పధ్నాలుగు భువనాల్లో వేంకటాచలం కంటే పవిత్రపుణ్యక్షేతం మరేదీ లేదని, వేంకటేశ్వరుడికంటే పూజించే దేవుడు మరొకరు లేరని గరుత్మంతుడు మార్కండేయుడికి చెప్పడంతో నేటి కపిల తీర్థంగా పిలుచుకునే ప్రదేశానికి మార్కండేయ మహర్షి చేరతారట.

కొండపైనున్న సప్తతీర్థాల్లో స్నానమాచరించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారట. వేంకటాచలం అంటే ఏంటో అందులోని పరమార్థం ఏంటో తెలుసుకుని ఆయన ఆశువుగా రాసిన పద్యాలే నేటి వేంకటేశ్వర సుప్రభాతంలోని భాగమైన వేంకటేశ్వరస్తోత్రం. మార్కండేయ మహర్షి వేంకటేశ్వర స్తోత్రం రాసిన చాలా ఏళ్ల తర్వాత ప్రతివాద భయంకర అణ్ణన్ ఆచార్యులు సుప్రభాతాన్ని రాశారు. వేంకటేశ్వరుడి అవతారాలల్లో ఒకటైన రంగనాథ స్వామి స్తోత్రాన్ని రాసిన శ్రీమనవల మాముని శిష్యుడే అణ్ణన్ ఆచార్యులు.
గంగ సరయు నదీ తీరంలో నిద్రిస్తున్న రాములవారిని మేల్కొలపడానికి రామాయణంలోని బాలకాండలో ప్రస్తావించిన కౌశల్యాసుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అనే శ్లోకాన్నే సుప్రభాతంలోని మొదటి శ్లోకంలో వర్ణించారు. శ్రీవీరప్రతాపరాయలు హయాంలో వేదపఠనంతో పాటే సుప్రభాత పఠనం కూడా మొదలైందని అంటారు.
స్వామివారికి నిత్యం జరిగే పూజల తరహాలోనే సుప్రభాత సేవ జరుగుతుంది. అవి కూడా వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం జరగాలని నిర్దేశింపబడింది.