శనీశ్వరుడు కర్మ ప్రదాత . శనివారం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా హిందువులు భావిస్తారు. అలాగే శనీశ్వరుడిని శనివారం రోజు ఆవ నూనెతో అభిషేకం చేస్తారు. మరికొంత మంది ఆవ నూనె దీపం కూడా వెలిగిస్తారు. అసలు శనీశ్వరుడికి ఆవనూనె అంటే ఎందుకు అంత ఇష్టం అంటే.. ఒక పురాణం కథనం  ఉంది. శనీశ్వరుడికి, ఆవనూనెకి గల సంబంధం తెలియాలంటే ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే..

Image Courtesy : Wikipedia


పురాణ కథనం:  రామాయణ కాలంలో ఒకసారి.. శనీశ్వరుడు తన బలం, శక్తిని గురించి తలచుకుని గర్వపడ్డాడు. అదే సమయంలో హనుమంతుడి పరాక్రమం నాలుగు దిక్కులకూ వ్యాపించింది. హనుమంతుని శక్తి గురించి శనీశ్వరుడికి తెలిసింది. దీంతో శనీశ్వరుడు.. హనుమంతునితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు తన ప్రభువు శ్రీరాముని భక్తితో ధ్యానం చేస్తున్న హనుమంతుడిని శనీశ్వరుడు చూశాడు. హనుమంతుడిని తనతో యుద్ధం చేయమంటూ శని సవాల్ చేశాడు. హనుమంతుడు .. శనిని యుద్ధం వద్దంటూ వారించాడు. అయినప్పటికీ శనీశ్వరుడు యుద్ధం చేయాల్సిందే అంటూ పట్టుబట్టడంతో.. ఇరువురు యుద్ధానికి దిగారు.  ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది.

Image Courtesy : Wikipedia

ఈ యుద్ధంలో శనిదేవుడు హనుమంతుని చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆంజనేయ స్వామి కొట్టిన దెబ్బలకు శనీశ్వరుడు శరీరమంతా గాయపడింది.. నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు హనుమంతుడు.. శనీశ్వరుడి దెబ్బలకు  ఆవనూనె పూసాడు. దీంతో శనీశ్వరుడి ఒళ్ళు నొప్పులు, దెబ్బలు మాయం అయ్యాయి. అప్పుడు శనీశ్వరుడు ఇక నుంచి ఎవరైతే.. హృదయపూర్వకంగా తనకు ఆవ నూనె సమర్పిస్తారో.. వారు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారని వరం ఇచ్చాడు. అప్పటి నుండి శని దేవుడికి ఆవాల నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది.

శనివారం నాడు తనకు ఆవాల నూనెను సమర్పించే భక్తులను శనీశ్వరుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని నమ్మకం. అటువంటి వ్యక్తుల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శనీశ్వరుడి దయతో.. శని మహాదశ ప్రభావం తగ్గుతుంది. పరమేశ్వరుడిని ఆరాధించడం ద్వారా కూడా శనిదేవుడి సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే శివుడు శని దేవుని గురువు. ఆయనను ఆరాధించడం వల్ల శనిదోషం తీవ్ర ప్రభావ స్వభావాన్ని తగ్గుతాడు. శనివారం శనిదేవుడికి సంబంధించి వస్తువులను నువ్వులు, నూనె, పత్తి, కాటన్ వస్త్రాలు, ఇనుప ఫర్నిచర్, లెదర్ ( తోలు ) చేయబడిన వస్తువులు దానం చేయాలి.

Image Courtesy : Wikipedia

పై అన్నింటి కన్ననూ.. ముఖ్యంగా పేదలకు, పశుపక్ష్యాదులకు ఆకలి తీరిస్తే చాలా చాలా అద్బుతమైన శుభ ఫలితాలు శని దేవుడు ప్రసాదిస్తాడు. అమ్మనాన్న, వృద్దులకు, వికలాంగులకు, అనాధలకు నిస్సహాయ స్థితిలో ఎవరు ఉన్నా వారికి మీకు చేతనైన సహాయం చేయగలిగితే శని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటుంది మనం చేసే సత్కార్యాలు సమాజానికి తెలిసేలా తాపత్రయపడుతూ చేస్తే ఫలితం శూన్యం అవుతుంది. గోప్యంగా, నిరాడంబరంగా చేయండి శుభాలను పొందండి.