దేశ వ్యాప్తంగా శ్రీ రామనవమికి ఆలయాల్లో, వీధుల్లో సందడి మొదలైంది. శ్రీరామ నవమి రోజున పానకం వడపప్పుకి అత్యంత ప్రాధ్యాన్యత ఉంది. నవమి రోజున పానకం, వడపప్పుని ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే దీనివెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది..

రాములోరి పండగ వస్తుంది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కమ్మని పానకం, వడపప్పు. ఈ కమనీయ  పదార్ధాలు శ్రీ రాముడికి ఎంతో ఇష్టమని చెప్తారు. అందుకే  శ్రీరామ నవమి రోజు అందరూ పానకం, వడపప్పు నైవేద్యంగా స్వామి వారికి నివేధన చేసి భక్తులకు వితరణ గావిస్తారు.  అయితే ఈ నైవేధ్యం వెనక పరమార్దం ఏమిటి

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

 పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, చర్మానికి కాంతినిస్తుంది. వడపప్పుగా పిలవబడే పెసరపప్పు వడదెబ్బ నుండి కాపాడుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉండటం వల్ల బుద్ధి వికసిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పెసర్లలో ఐరన్‌ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడతాయి. వడపప్పులో వాడే కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది.

పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి. దాహాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎండ తీవ్ర నుండి కాపాడతాయి. మిరియాల్లో ఉండే చవిసిన్ అనే పదార్ధం అజీర్తి సమస్య నుండి కాపాడుతుంది. లాలా జలం ఊరేలా చేస్తుంది. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణ మౌతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్‌ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. బెల్లం జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది.

వడపప్పు తయారీ
కావలసినవి:  పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా
తయారీ: ∙ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్‌ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది.

పానకం తయారీ
కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరాయల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ∙ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ గ్లాసులోకి తీసుకుని తాగాలి.