బిల్వ పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజలో  ఖచ్చితంగా బిల్వ పత్రాన్ని వాడతారు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు.. అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు.  

త్రిదళం త్రిగుణాకారం
 త్రినేత్రంచ త్రియాయుధం౹
 త్రిజన్మ పాపసంహారం
 ఏకబిల్వం శివార్పణం౹౹..

అందరికీ ఈ శ్లోకం తెలుసు. కానీ ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం..

 తెలియనివాళ్ళు ఉంటే తెలుసుకుంటారని దీని అర్థాన్ని చెప్పడం జరిగింది.

  త్రిదళం

 అంటే మూడు ఆకులతో కూడుకున్నది. మూడు ఆకులతో ఉన్నదాన్ని ఒక దళం అంటారు.

మారేడు చెట్టు  ప్రతి కొమ్మకి మూడు ఆకులు చొప్పున దళాలు ఉంటాయి. ఆ విధంగా ఉండడం ప్రకృతి గొప్పతనం.

 త్రిగుణాకారం

మూడు ఆకులూ మూడు గుణాలు కలిగి ఉంటాయి.

త్రిదళంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు.

 త్రినేత్రం

మూడు కన్నుల వాడు శివుడు. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కన్ను.

 త్రియాయుధం

 అంటే త్రిశూలం

 ఏకబిల్వం శివార్పణం

పరమ శివుడికి ప్రీతికరమైనటువంటి బిల్వపత్రం ఒక దళం సమర్పిస్తే చాలు.

 త్రిజన్మ పాపసంహారం

మూడు జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి.

బిల్వపత్రములను (మారేడు) సోమ, మంగళ, శుక్ర వారములలోనూ, సంక్రమణం సమయంలోనూ, అసౌచ సమయంలో, రాత్రి సమయాలలోనూ కోయరాదు.

బిల్వదళమును శుద్ధ జలంతో కడుగుతూ పదిరోజులు వాడుకోవచ్చు. కానీ సోమవారం, ప్రత్యేకరోజుల్లో మాత్రం ముందురోజు చెట్టునుండి సేకరించిన వాటితో అర్చనచెయ్యాలి.

మారేడు దళానికి ముందుబాగంలో అమృతం, వెనుకబాగంలో యక్షులు వుంటారు. కనుకనే బిల్వపత్రం ముందుభాగం శివలింగంపై వుండేలా సమర్పించాలి…