శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’అనే విషయం తెలిసిందే.   హరహర మహాదేవ అంటూ మనసారా స్మరిస్తూ.. జలంతో అభిషేకించిన భక్తునకు వశమయ్యి.. కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడుగా మన పురాణాలు అభివర్ణిస్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడుగా మారటం వెనక కారణం ఏమిటి అంటే….

ఆ పరమశివుడు హాలాహలాన్ని కంఠమందు ధరించమే ఒక్కటే కారణం కాదు.ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. అందుకే
శివో అభిషేక ప్రియః అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట! ‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట!! శివార్చన అభిషేకం చేస్తే  అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు.
అందుకే ఆయన భోళా శంకరుడు.

ధారాభిషేకం:
కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.
ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం:
జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి.
ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం:
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’.
తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం:
చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి.
శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం:
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం.
ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు
లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం:
ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి.
లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని
శాస్త్ర వచనం.

మహారుద్రాభిషేకం:
భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు
మహా రుద్రాభిషేకం ఇష్టం.
మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి .

అతిరుద్రాభిషేకం:
ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’
సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది.
అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం,
ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి ,
బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు
ఆరోగ్య అభివృద్ధి.
స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు,
కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం,
నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.
శివాభిషేకంలో..మహన్యాసం, లఘున్యాసం, నమకం,చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా,
ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు.

శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు.  కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి.

“ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్” అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పఠిస్తూ అభిషేకం చేయాలి.

”పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్”

పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.