ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. వినాయకుని అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే లభిస్తాయి. ఈ చవితి నాడు ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు.  ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది.

 మనము ఏ కార్యాన్ని ప్రారంభించినా మొదట విఘ్నేశ్వరుని యొక్క స్తుతితో అధవా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభం చేస్తాం. ఆయన పేరు విఘ్నరాజు. విఘ్నరాజు,వినాయకుడు అని నామములు. విఘ్నరాజు ఏమి చేస్తాడో వినాయకుడు అది చేయడు.వినాయకుడు ఏమి చేస్తాడో విఘ్నరాజు అది చేయడు. పేర్లు అయితే రెండూ ఒకరికే అన్వయం.అవి అలా అన్వయమవటానికి కారణ మేమి అంటే ఈశ్వర తత్వమందు నామములు ఏమైనా గౌళములు. ఆయా గుణములను ఆధారం చేసికొని ఆ నామముతో పిలుస్తారు.

అందుచేత ఏ గుణం ప్రకాశిస్తోంది అని మీరు అర్ధం చేసికొన్నారో,అర్ధం చేసికొన్న విషయాన్ని ఆలంబనంగా స్వీకరించి ఉపాసనా క్రమాన్ని దిద్దుకొనే ప్రయత్నం చేస్తారు సాధకులు.అందుకొరకు నామములు వచ్చాయి తప్ప అన్ని నామములు ఉంటే ఈశ్వరునికి ప్రఖ్యాతి అనో, అన్ని నామములుతో ఆయన సరదాగా పిలిపించుకుంటాడనో మనం అనుకోకూడదు. నామములు గౌళములు. వినాయకుని విషయములో కూడా ఆయనని వినాయకుడు అనీ పిలుస్తాము, విఘ్నరాజు అనీ పిలుస్తాము.

హిందూ పురాణాల ప్రకారం, విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటి పూజను చేయాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, వ్యక్తిగతంగా, కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు.

బ్రహ్మవైవర్తన పురాణంలో ‘గణ’ అనే పదానికి అర్థం కూడా ఉంది. ‘గ’ అంటే విజ్ఞానమని, ‘ణ’ అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతారు. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు గణపతి జయ కావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారట.

కొన్ని ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు, పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుని నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి అగ్రస్థానం.